Tuesday, November 26, 2024

ఆర్టీసీలో ‘కుర్చీ’ పంచాయితీ.. సెలవుపై వెళ్లొచ్చిన అధికారికి సీటివ్వని ఇన్‌చార్జ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆర్టీసీలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన ‘కుర్చీ’ పంచాయితీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. సెలవు నుంచి వచ్చిన అధికారికి సీటు ఇచ్చేందుకు మరో అధికారి నిరాకరించడంపై ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆర్టీసీ విజయవాడ జోనల్‌ ఈడీ(ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌) గా విధులు నిర్వహిస్తున్న గిడుగు వెంకటేశ్వరరావు ఆరు నెలలు సెలవు పెట్టి అమెరికాలోని కుమార్తె వద్దకు వెళ్లారు. మే నెలాఖరులో అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. విజయవాడ ఈడీ ఆరు నెలల పాటు సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో మైనార్టీ కార్పొరేషన్‌లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఆదాం సాహెబ్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.
గతంలో కడప ఈడీగా పనిచేసిన ఆదాం సాహెబ్‌ డెప్యుటేషన్‌పై మైనార్టీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుత ఈడీ వెంకటేశ్వరరావు సెలవుపై వెళ్లడంతో డెప్యుటేషన్‌ రద్దు చేసుకుని ఆర్టీసికి తిరిగి వచ్చి ఈడీ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసును మరో రెండేళ్ల పాటు పొడిగించింది. దీంతో సెలవు రద్దు చేసుకుని తిరిగొచ్చిన వెంకటేశ్వరరావు శుక్రవారం ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఎండీ తిరుమలరావు ఈడీ ఆదాం సాహెబ్‌ను పిలిపించి ప్రస్తుత ఈడీ సెలవు రద్దు చేసుకున్నారు కాబట్టి ఆయన విధులు తిరిగి ఆయనకే అప్పగించాలని, ఇదే సమయంలో మొబైల్‌ సిమ్‌ను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో శనివారం ఈడీ వెంకటేశ్వరరావు వర్క్‌షాప్‌ పరిశీలనకు వెళ్లారు.

ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చిన ఆదాం సాహెబ్‌ ఈడీ సీట్‌లో కూర్చుని కనిపించడంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. తనకు ఇంకా అధికారిక ఆదేశాలు అందలేదు కాబట్టి తానే ఈడీనంటూ ఆదాం సాహెబ్‌ పేర్కొనడం పట్ల ఆర్టీసీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. విషయం తెలిసిన ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు ఏం చేయాలో పాలుపోక సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వీరద్దరి ‘కుర్చీ’ పంచాయితీ మరోసారి ఎండీ తిరుమలరావు వద్దకు చేరనుంది. ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement