Friday, November 22, 2024

కేంద్రం కీలక నిర్ణయం.. పంచాయతీలకే నేరుగా నిధులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వాలకు పెత్తనం లేకుండా వచ్చేనెల అంటే జులై నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే జమ కానున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు డైవర్ట్‌ చేసుకునే అవకాశం లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉపాధి హామీ నిధులను నేరుగా ఇస్తున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీని కూడా నేరుగానే విడుదల చేస్తున్నారు. తాజాగా పంచాయతీ నిధులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో కొత్త ఖాతాలు తెరిచారు. ప్రతినెలా దాదాపు రూ. 300 కోట్లకుపైగా నిధులు ఈ పంచాయతీలకు జమ అవుతుంటాయి.

ఇక నేరుగానే..

ఇప్పటికే పలు పథకాలపై రాష్ట్ర పెత్తనాలను కేంద్రం తగ్గించనుంది. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రం పంచాయతీలకు ఇస్తోంది. ఉపాధి హామీలో రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు అధికారాలిచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేసేలా నిధులను నేరుగా పంపిస్తోంది. దీంతో గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని భావిస్తోంది. వచ్చేనెల అంటే జులై నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ విధానంతో సర్పంచులకు ఊరట లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసే విధంగా జీవో విడుదల చేయనుంది. గ్రామ సభలో తీర్మానించిన పనుల బిల్లులను వెంటనే తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు అందేవి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా నిధులను అందజేయనుంది. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులతో మంజూరైన నిధులను పంచాయతీల ఖాతాల్లోకి చేరేందుకు రెండు, మూడు నెలల సమయం పట్టేది. ఈ కారణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టినా.. బిల్లుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇది పంచాయతీలకు భారంగా మారేది. ఇకపై ఆ విధానానికి ఫుల్‌స్టాప్‌ పడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement