న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా చేసిందని సీపీఎం నేతలు విమర్శించారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. కేరళలో జరిగే 23వ సీపీఎం జాతీయ మహా సభల్లో సమర్పించే సంస్థగత నివేదికపై చర్చ, దేశ ప్రస్తుత పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు,కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, భవిష్యత్ పోరాటాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస రావు, తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యులు సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం అనంతరం వారు సుర్జీత్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పోలవరం చూసి కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పిన మాటలను పార్లమెంట్ లోప్రకటన సందర్భంగా మార్చేశారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు.
కేంద్రానికి పోలవరంపై శ్రద్ధ లేదని, అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం విషయంలో బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ వివాదాన్ని రేపుతున్నారని, ఏపీ అప్పులు పరిధి దాటిపోయాయని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అప్పు పేరుతో తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అలాగే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటికరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారని తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చంద్రబాబు హయాంలో చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందని, చంద్రబాబు అధికారం కోల్పోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం ధరలు తగ్గించక పోతే మళ్లీ ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలని తమ్మినేని కోరారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. వరి విషయంలో బీజేపీ, టీఆరెస్ తగాదాలా కాకుండా అఖిలపక్షాన్ని కూడా కలుపుకుపోవాలని సూచించారు. రాజకీయాలను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కలపొద్దని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఫ్రoట్‌లు సక్సెస్ కావన్న తమ్మినేని కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర సమస్యలపై పోరాడాలని కోరారు.