ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజమండ్రి-అనకాపల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ డా.సీఎం రమేష్ తెలిపారు.
జాతీయ రహదారి 16 పరిధిలోని అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు సెక్షన్లో నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరణకు డీపీఆర్ కన్సల్టెంట్ కు అందజేశారని, అదేవిధంగా జతీయ రహదారి 40లో రాయచోటి-కడప సెక్షన్లో నాలుగు వరుసల రహదారి టన్నెల్ నిర్మాణం ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్రం తెలిపిందని సీఎం రమేష్ అన్నారు.
టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరం ఉన్నందున, అటవీ శాఖ నుంచి అలైన్మెంట్ అనుమతులు వచ్చిన తరువాత టన్నెల్ తో పాటు నాలుగు వరుసల రహదారి నిర్మాణ ప్రతిపాదనలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారని ఎంపీ సీఎం రమేష్ తెలియజేశారు.