అమరావతి, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పనిదినాల్లో కేంద్రం సగానికి పైగా కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల పనిదినాలు కేటాయించాలని కోరగా కేంద్రం 14 కోట్ల పనిదినాలను మాత్రమే మంజూరు చేసింది. ఇందులో ఈ రెండు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధింగా 8 కోట్ల పనిదినాలు వినియోగించుకుంది. కాగా ఈ ఏడాది చివరివరకు కేవలం 6కోట్ల పనిదినాలు మాత్రమే మిగిలివున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కింద రాష్ట్రాన్రికి 14 కోట్ల పని దినాలను మంజూరు చేయగా, అందులో ఇప్పటి వరకు 8.03 కోట్ల పని దినాలను (57.40 శాతం) ప్రభుత్వం వినియోగించుకుంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా పది నెలలు గడువుండగా, 5.97 కోట్ల పని దినాలే మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలిస్తే ఇవి ఒకటీ రెండు నెలలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద ఏడాదిలో కనీసం వంద రోజుల పని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని అమలు చేస్తోంది.
రాష్ట్రంలో గతేడాది కార్మికులకు 26 కోట్ల పని దినాలు కల్పించారు. ఉపాధి పనికి గ్రామాలలో డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం ఈ సంవత్సరం 30 కోట్ల పని దినాలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపించింది. అయితే, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కేవలం 14 కోట్లనే మంజూరు చేసింది. అందులో ఎనిమిది కోట్ల పని దినాలు రెండు నెలల్లోనే పూర్తికావడంతో, మిగిలిన కాలంలో కార్మికులకు పని కల్పన కష్టసాధ్యమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రాల్రు ఇచ్చిన ప్రతిపాదనలలో ఒకటీ రెండు కోట్ల పని దినాలను అటూ ఇటుగా మంజూరు చేస్తారు. ఈసారి సగంపైనే పని దినాలను కోత పెట్టడంతో ఏడాదంతా ఉపాధి కల్పనపై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు పని దినాల కోసం త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుంటే రాష్ట్రంలో 98.42 కోట్ల జాబ్ కార్డులుండగా, 1.96 కోట్ల మంది ఉపాధి కార్మికులు ఉన్నారు. వీరిలో సగటున 56 లక్షల మంది కార్మికులు ఉపాధి పనులకు హాజరవుతున్నారు.
ఇప్పటి వరకు 32.87 లక్షల కుటుంబాలలో 51.72 లక్షల మంది కార్మికులు ఉపాధి పనికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాన్రికి 14 కోట్ల పని దినాలు మంజూరైతే, ఇప్పటి వరకు 8.03 కోట్ల (57.40 శాతం) పని దినాలను పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఉపాధి పనులకు వచ్చే వారిలో 24 శాతం మంది ఎస్‌సిలు, 10 శాత మంది ఎస్‌టిలు ఉన్నారు. మొత్తంగా 60 శాతం మంది మహిళలు ఉన్నారు. ఏడాది కాలానికి మంజూరైన పనుల్లో సగానికిపైగా పనులు పూర్తయితే, మిగిలిన పది నెలలకు ఆరు కోట్ల పని దినాలు ఏమాత్రం సరిపోవని అధికారులే చెబుతున్నారు. ఉపాధి పథకం కింద రెండు నెలల్లో రూ.1,833.50 కోట్లు ఖర్చయినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఇందులో రూ.1,510.92 కోట్లు- వేతనాల కింద ఖర్చవ్వగా, రూ.292.04 కోట్లను మెటీరియల్, స్కిల్డ్ లేబర్‌కు వేతనాల రూపంలో చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ రూ.1,828.69 కోట్లను విడుదల చేయగా, ఉపాధి కార్మికులకు రూ.1,363.48 కోట్లను వేతనాల రూపంలో చెల్లించారు. రాష్ట్రంలో ఉపాధి కార్మికులకు రోజుకు రూ.257 వేతనం చెల్లించాల్సి ఉండగా, సగటున రూ.195 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. మొదటి నెలలో సగటు వేతనం రూ.177 ఉండగా, ఈ నెలలో అది రూ.195కు పెరిగింది. పని దినాలు పెరిగితే, సుమారు రూ.220 నుంచి రూ.230 వరకు సగటు వేతనం పెరిగే అవకాశం ఉందని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.