Friday, November 22, 2024

బడ్జెట్‌ చరిత్రాత్మకం.. భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించే మైలురాయి : స్పీకర్‌ తమ్మినేని సీతారాం..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు దర్పణం పడుతోంది.. ఇది చారిత్రాత్మకమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశంసించారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌పై స్పీకర్‌ ప్రతి స్పందించారు. ఇంత అద్భుతమైన బడ్జెట్‌ ఎక్కడా ఉండదన్నారు. అభివృద్ధి.. సంక్షేమాల సమతుల్యంతో చక్కటి కూర్పు నిచ్చారని అభినందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాటనపెట్టే ప్రయత్నమన్నారు. ప్రాధాన్యతా క్రమంలో అన్ని రంగాలకు కేటాయింపులు భేష్‌ అన్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం నాడు అవినీతిలేని పారదర్శక పాలన అందిస్తానని పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని చెప్పిన మాటల్ని స్పీకర్‌ గుర్తుచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంతో పాటు ఓ లక్ష్యం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. లక్ష్యం వేరు.. ఆలోచన వేరు.. గమ్యం వేరని చెప్తూ సాహసోపేతంగా సంక్షేమ కార్యక్రమాల అమల్లో లక్ష్యాలను నిర్దేశించుకుని స్పష్టమై నిర్ణయాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో భాగమే ఈ బడ్జెట్‌ అని అభివర్ణించారు.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వచ్చిన కామన్‌వెల్త్‌ క్రీడాకారిణి ఆయన్ను చూడగానే జగన్‌ మావయ్య అని సంబోధించటం పిల్లల హృదయాల్లో పవిత్రస్థానం పదిలపరచుకున్నట్లు అవగతమైందన్నారు. ప్రస్తుతం విజ్ఞాన ప్రపంచం పరుగులు తీస్తోంది.. దాంతో పరిగెడతారో.. పల్టి కొడతారో నిర్ణయించాల్సింది ప్రజలేనని పోటీ ప్రపంచంలో విశ్వ విజ్ఞాన వేదికపై విజయకేతనం ఎగురవేసే ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి విజన్‌ ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో నిర్దేశించుకున్న‌ లక్ష్యాలను అధిగమించేందుకు బడ్జెట్‌ మరో మైలురాయిగా పునరుద్ఘాటించారు. పేదరికం అనేది విద్య.. వైద్యం.. సేద్యానికి అడ్డంకి కారాదనేది ప్రభుత్వ విధానంగా ప్రస్ఫుటమవుతోందని సీఎం జగన్‌ నేతృత్వంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ అభినందనీయమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement