శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 19 (ఆంధ్రప్రభ) : నాలుగు రోజుల క్రితం పెనుకొండ బాబయ్య స్వామి ఉరుసుకు వచ్చిన కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం మహమ్మద్ అల్మాన్ అనే నాలుగేళ్ల బాలుడిని కోల్పోయిన సంఘటన ఇది. కర్ణాటకకు చెందిన పలువురు బాబయ్య స్వామి ఉరుసు కోసం మొదటిరోజు పెనుకొండకు వచ్చారు. అయితే ఆ కుటుంబానికి చెందిన మహమ్మద్ అల్మాన్ అదే రోజు నుంచి కనిపించకుండా పోయారు.
ఇదే విషయాన్ని బుధవారం పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతలో గురువారం దర్గా వెనుక భాగంలో ఒక మురికి కాలంలో ఒక బాలుని శవం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, సదరు బాలుని శవం బయటకు తీశారు. కుటుంబ సభ్యులు బాలుడి శవాన్ని చూసి మహమ్మద్ అల్మాన్ అని తేల్చినట్లు సమాచారం. కాగా బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడా లేక ఇతర కారణాలతో మృతిచెందాడా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.