Saturday, November 23, 2024

AP: కన్నాపై బీజేపీ హైకమాండ్​ కస్సు బుస్సు.. పక్కచూపులపై ఆరాతీసిన నడ్డా

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణ రూపంలో బద్దలైంది. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ పేల్చిన బాంబు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా కొందరు నేతలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర నేతలను కలుపుకొని వెళ్లడంలో సోము వీర్రాజు వైఫల్యం చెందినట్లు ఓ వర్గం భావిస్తోంది. కీలక విషయాల్లో సైతం తమను కలుపుకోవడం లేదంటూ అంతర్గత సమావేశాల్లో కొందరు నేతలు అభిప్రాయపడినట్లు చెపుతున్నారు.

జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర పార్టీల అంశాల్లో అంటీ ముంటనట్టుగా ఉంటుందని కొందరు నేతలు చెపుతున్నారు. ఎవరితో చర్చించకుండానే ప్రజాపోరు వీధి సభల సమీక్షా సమావేశంలో సోము వీర్రాజు నేతృత్వంలోనే 2024 ఎన్నికలకు వెళుతున్నామంటూ చెప్పడంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పార్టీలో కీలకమైన కోర్‌ కమిటీ సమావేశాలు సైతం తూతూ మంత్రంగా సాగుతున్నాయనేది వీరి వాదన. కోర్‌ కమిటీ సమావేశాల్లో వాస్తవ అజెండా ఉండటం లేదని చెపుతూ అసంతృప్తితో రగులుతున్న నేతలకు..జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైఖరి షాక్‌కు గురి చేసిందని చెప్పొచ్చు.

బీజేపీ తీరుపై పవన్‌ కళ్యాణ్‌ నిరసన గళం విప్పిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు భేటీ కావడం కొందరు నేతలు జీర్ణించుకోలేకపోయారు. వారిలో కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒకరని చెప్పొచ్చు. పవన్‌ కళ్యాణతో కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన నేపధ్యంలో రాష్ట్ర నాయకత్వం సక్రమంగా స్పందించపోవడం ఇందుకు విఘాతం కలిగిందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ..కొందరు సన్నిహిత నేతలతో సమావేశమై చర్చించి పార్టీపరమైన అంశాలను చర్చించారు. ఆ తర్వాతనే బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పార్టీ అంశాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణతో కొందరు బీజేపీ నేతలు సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

రాష్ట్ర నాయకత్వ వైఫల్యమే..
పొత్తులో ఉన్న జనసేనను కలుపుకెళ్లడంలో రాష్ట్ర నాయకత్వ వైఫల్యంపై తనకు భిన్నాభిప్రాయమేమీ లేదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో అంతర్గతంగా తనకు ఇదే అభిప్రాయం ఉందని చెపుతూ ఇప్పుడు బయటకు చెపుతున్నానన్నారు. గతంలో కీలకమైన అంశాలపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశమై చర్చించుకునే వారమని చెప్పారు. ఇప్పుడు అన్ని వ్యవహారాలను సోము వీర్రాజు ఒక్కరే చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏం జరుగుతుందో కూడా ఎవరికీ చెప్పడం లేదని, చివరకు కోర్‌ కమిటీ సమావేశాల్లో సైతం చర్చించడం లేదన్నారు. జనసేనను కలుపుకెళ్లడంలో రాష్ట్ర నాయకత్వం తీరును కేంద్ర నాయకత్వం గతంలోనే గుర్తించిందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్‌ జనసేనతో సమన్వయం చేసుకుంటారని కేంద్ర నాయకత్వం చెప్పిందని తెలిసిందన్నారు. మరి ఇప్పుడేం చేయాలి అనేది కేంద్ర నాయకత్వమే చూసుకుంటుందని కన్నా పేర్కొన్నారు.

- Advertisement -

జేపీ నడ్డా ఆరా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో చర్చించారు. పవన్‌, చంద్రబాబు భేటీ నేపధ్యంలో హుటాహుటిన మంగళవారం రాత్రికే ఢిల్లిd చేరుకున్న సోము వీర్రాజు బుధవారం ఉదయం నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరంగా తీసుకుంటున్న చర్యలు, జనసేన అంశం సహా పలు అంశాలను ఆయనకు వివరించారు. అయితే కోనసీమ అల్లర్లు సహా పలు అంశాల్లో పార్టీ వైఖరి ఆశించినంతగా లేదనే అభిప్రాయం నడ్డా వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిత్రులను దూరం పెట్టడం సరికాదంటూ ఉన్న మిత్రులను పోగొట్టుకోవడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లిd పర్యటన ముగించుకొని బెంగుళూరు చేరుకున్న సోము వీర్రాజు గురువారం విజయవాడ చేరుకొని ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

తెదేపా వైపు కన్నా చూపు
రాష్ట్ర బీజేపీ నేతల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన కన్నా లక్ష్మీనారాయణ తెదేపాలోకి వెళ్లనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తారని చెపుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారనేది బీజేపీలోని కొందరు నేతల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement