గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో అతిపెద్ద స్కామ్ జరిగిందని, ఇది స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన స్కామ్ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీఎం వైయస్ జగన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇదన్నారు. దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసు అన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్ ఊపిరి పోసుకుందని చెప్పారు. వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు కొట్టేశారని విమర్శించారు. లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదని, దోచుకో, పంచుకో, తినుకో అన్నదే వారి విధానమన్నారు. ఈ స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని సాక్ష్యాధారాలతో సీఎం వైయస్ జగన్ శాసన సభ ద్వారా వివరించారు.
రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్ గురించి కొద్ది మాటలు చెప్పాలన్నారు. స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారన్నది సభ ద్వారా ఎమ్మెల్యేలకు, ప్రజలకు అవగతం ఉండాలన్నారు. అందుకే ఈ టాఫిక్ మీద బెటర్ క్లారిటీ ఇచ్చేందుకు, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సభ ద్వారా తెలియజేస్తున్నానన్నారు. స్కిల్ ద్వారా నిజంగా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగాల్లో వారికి వచ్చే అవకాశాలను మెరుగు పరచాలని ప్రభుత్వం కృషి చేయాలి. కానీ స్కిలింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్ అన్నారు. ఇటువంటి స్కిలింగ్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ రకంగా మోసం చేశారో ప్రజలకు తెలియాలన్నారు. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకొని ఆ పది రూపాయలు కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఈ వ్యవహారం ఉంటుందన్నారు. ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్ స్కామ్‌ను చెప్పవచ్చన్నారు. విదేశాలకు కూడా షెల్ కంపెనీలకు ఈ స్కామ్ పాకిందన్నారు. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చిందన్నారు. ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటలీజెన్సీ, ఈడీ, సీఐడీ ఇలా ఏజెన్సీలు అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారని సీఎం జగన్ తెలిపారు.