బెంజి సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పరిశీలించారు. డిసెంబర్ 10న కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం రవాణా, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ జే.నివాస్, మునిసిపల్ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, డిఆర్వో యం.వెంకటేశ్వర్లు, డీసీపీ వి.హర్షవర్ధన్ రాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, నేషనల్ హైవేస్ పీడీ నారాయణ్, ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ (ఎల్ ఐడిపిల్) యండి వేములపల్లి రవికిరణ్, తదితరులు పరిశీలించారు. స్క్రూ బ్రిడ్జి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు, అనంతరం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రాష్ట్రంలో వివిధ ప్రోజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవ, శంఖుస్థాపన శిలాఫలకాలు ఏర్పాట్లు, ఫోటో ఎగ్జిబిషన్, వేదిక నిర్మాణం, ప్రోటోకాల్ పాటించడం తదితర అంశాలపై వారు చర్చించారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై ఆయా అధికారులకు ప్రిన్సిపాల్ సెక్రెటరీ యం.టి.కృష్ణ బాబు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ… విజయవాడ నగరంలో స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటల్ హోటల్ మధ్య సుమారు రూ.88 కోట్లతో నిర్మించిన బెంజ్ సర్కిల్లో రెండవ ఫ్లై ఓవర్ ను ఈనెల 10వ తేదీ ఉదయం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రవాణా శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి యం.టి కృష్ణ బాబు అద్వర్యంలో ఈరోజు సమావేశమై సమీక్షించడం జరిగిందన్నారు. స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటల్ వరకు 2.47 కిలోమీటర్ల మేర బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు.
దీని మూలంగా ఎన్ హెచ్ 16లో ముఖ్యంగా నగరంలోని బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. నిర్ణిత సమయానికి ముందుగానే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్లై ఓవర్ రిటైనింగ్ గోడలకు ఇరువైపులా నాయిస్ బేరర్లు ఏర్పాటు చేశారని దీనివల్ల వాహనాల వల్ల వచ్చే శబ్దాన్ని తగ్గించగలదన్నారు. వీరి వెంట ట్రాఫిక్ డీసీపీ టి.సర్కార్, ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ బ్రహ్మయ్య, సి యంహెచ్ ఓ డా.గీతబాయ్, తహసీల్దార్ వెన్నెల శ్రీను, పలువురు పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బి, ఉద్యానశాఖ, వియంసి తదితర శాఖల అధికారులున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital