విశాఖపట్నం, (ప్రభన్యూస్): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అందాల అరకులోయలో వలిసెల అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఈ సీజన్‌లో గిరి రైతులు వాణిజ్య సాగుగా పండించే వలిసెపూల తోటలు అరకులోయ అందాలకు ఎంతగానో వన్నె తెస్తున్నాయి. ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన అందాలకు వలిసె సొగసులు తోడవడంతో అరకులోయ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అరకు సందర్శనకు తరలివచ్చే పర్యాటకులు సరికొత్త అందాలను తిలకించి అబ్బుర పడుతున్నారు. వాహ్ అరకులోయ అందాలను వర్ణించడం ఎవరి తరం అంటూ పర్యాటకులు చెప్పుకుంటు-న్నారు.
ఎటు- చూసిన పసుపు చీరకట్టిన పడుచులా, వలెసి పూలతోటలు చూడచక్కగా కనిపించడంతో పర్యాటకులు ఆహ్లాద భరితులవుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న వలసిపూల తోటలో ఫోటోలు దిగుతూ సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు తమ పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో కలిసి పూలతోటల్లో కలియతిరుగుతూ మురిసిపోతున్నారు. వలిసె పూలతోటలు గిరి రైతుల ఆర్థిక అభివృద్ధి దోహదపడుతున్నాయి. అరకులో ప్రకృతి సోయగాలను కనులారా చూసి ఆస్వాదించాలంటే నవంబర్, డిసెంబర్ మాసాలలో పర్యటించాలని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ ప్రథమార్ధం వరకు మాత్రమే వలిసేపూల సొగసులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily