అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను బీహార్ కంటే దారుణంగా వైకాపా మార్చిందని అధికార పార్టీ నేతలు నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానస్పద మృతిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఇది రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
సుబ్రహ్మణ్యాన్ని హత్యచేశాడని బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా.. ఎమ్మెల్సీని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోవడానికి స్పెషల్ లైసెన్స్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా అని దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును, ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ ఉదంతంపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..