తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ అన్నారు. ఇవ్వాల (మంగళవారం) శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారిమెట్లు వద్ద ఉన్న టీటీడీకి చెందిన శ్రీకృష్ణదేవరాయల సదన్ తో పాటు కళ్యాణకట్టను పరిశీలించారు. ఈసందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సేవలు, సౌకర్యాలను అధికారులను అడిగితెలుసుకోవడం జరిగిందన్నారు. దూరప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు అందిస్తోందని వివరించారు.
శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 5వేల నుండి 10వేల మంది దాకా కాలినడకన చేరుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు కాలకృత్యాలుతీర్చుకోవడంతోపాటు స్నానాలు చేసి, విశ్రాంతి తీసుకునేందుకు శ్రీవారి మెట్లు ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల వసతి సముదాయం అందుబాటులో ఉందన్నారు. క్రమంగా తిరుమలకు భక్తులు పెరుగుతున్నందున గదులు, మరుగుదొడ్లు అవసరమని గుర్తించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి. సూపరింటెండెంట్ మునిచంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు.