Wednesday, September 25, 2024

AP: విశాఖ‌ను 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా మార్చడమే లక్ష్యం… నారా లోకేష్

(ప్రభన్యూస్ బ్యూరో – విశాఖపట్నం) : విశాఖను 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతిపై దృష్టి సారిస్తున్నామ‌ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం కు సంబంధించి రోడ్డు కనెక్టివిటీ ను మరింత సులభతరం చేస్తామని ఆయన వెల్లడించారు. సీఐఐ నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగి హాజ‌రై ప్రసంగించారు. విశాఖపట్నంను భారతదేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలను ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖపట్నం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయం, ఐటి ఫార్మా హబ్ అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం ద్వారా నగరాన్ని గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. తాము ముఖ్యంగా డిస్ట్రిక్ట్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అనంతపురం వంటి నగరాలను మొబిలిటీ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. కర్నూల్‌ను పునర్నిర్మాణం చేస్తున్నాం, 72 జిడబ్ల్యు పునరుత్పాదక శక్తిని ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల్లో రూపొందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. విశాఖపట్నంలో 12 ఫ్లైఓవర్‌లను 3 పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే లుగా మారుస్తున్నామ‌ని నారా లోకేష్ తెలిపారు.

ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి మాట్లాడుతూ…. ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీ పరంగా దేశంలో 10వ స్థానంలో ఉందన్నారు. విమానాశ్రయ రవాణాలో 27వ స్థానాన్ని కలిగి ఉందని తెలిపారు. జీఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ… విమానాశ్రయానికి సులభమైన రవాణా అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలను తిరిగి ప్రారంభించాలన్నారు. దీని పై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. 15 రోజుల్లో కార్గో సర్వీసెస్ ను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

- Advertisement -

పోర్ట్ లాజిస్టిక్స్ బహుళ రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో సక్రమమైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలని తాము కట్టుబడి ఉన్నామ‌ని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రగతి ప్రతిష్ఠను పెంచే అంశాలపై కేంద్రీకృతమైన దృష్టితో, విశాఖపట్నం భారతదేశంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement