Tuesday, November 26, 2024

AP| ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఏపీ ఎన్జీవో సంఘం

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్ర ఎన్జీవో సంఘం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ 21వ మహాసభ రెండవ రోజు కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై ఉద్యోగులకు స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులలో కొన్ని విభాగాల వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందు ఉంచామన్నారు. వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఇచ్చిన హామీని తాము విశ్వసిస్తున్నామన్నారు.

సంఘం నిర్వహించే మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడం గత ఏడు దశాబ్దాలుగా ఒక ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ గా ఉన్న తమ సంఘం పేరు త్వరలో ఏపీ ఎన్.జి.జి.ఓ అసోసియేషన్ గా మార్పు చేసేందుకు ఈరోజు తీర్మానం చేసినట్టు చెప్పారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులలో కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు విభాగంలోకి రూపాంతరం చెందారన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తమ సంఘంలో గెజిటెడ్ ఆఫీసర్లను కూడా సభ్యులుగా చేర్చుకోవాలని సంకల్పించామన్నారు. తమ బై లాలో ఇందుకు అవసరమైన సవరణలను కూడా చేపట్టి తమ సవరించిన అంశాలతో కూడిన ప్రతులను ప్రభుత్వానికి పంపిస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక తమ సంఘం పేరును మారుస్తామన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్న.ఇదే విషయంలో కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపిన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం చేసేలా సంఘం బాధ్యత తీసుకుంటుందన్నారు. సంఘంలో జరిగే ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకునేందుకు తమ బైలాలో అవసరమైన ప్రతి అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ప్రతి ఉద్యోగి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన తన హక్కును కాపాడుకునేందుకు సంఘం అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement