Friday, November 22, 2024

That is Chandra Babu – కలెక్టరేట్ లోనే మకాం – అక్కడ నుంచే సహాయ కార్యక్రమాలు పర్యవేక్షణ

విజయవాడ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

కాగా, వరద సహాయక చర్యల విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిందని, ఇది ఊహించని విపత్తు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయక చర్యలు అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బోట్ల ద్వారా వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తున్నామని వెల్లడించారు. సహాయక చర్యలను మంత్రులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని, వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆయన చెప్పారు

ఇదే సందర్భంగా క్షేత్రస్థాయి తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్‌లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని సూచించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశించారు.

- Advertisement -

సహాయక చర్యలు వేగవంతం కావాలన్న సీఎం.. తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్‌ ఫుడ్‌ బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు.

విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్‌ బాటిల్స్‌ తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం.. సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలని ఆదేశించారు. అక్షయ పాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని, ఖర్చు గురించి ఆలోచన చెయ్యవద్దని అధికారులకు స్పష్టం చేశారు.

అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి పంపించారు. నిముషాలు లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వెంటనే అన్ని దుకాణాల నుంచి బిస్కట్లు, పాలు తెప్పించాలని సూచించారు.

ఈ రాత్రి కలెక్టర్ కార్యాలయంలోనే మకాం

విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్‌ సీఎం.. తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఇవాళ బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో మకాం వేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ వెంటనే కలెక్టరేట్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు

. .

.

Advertisement

తాజా వార్తలు

Advertisement