ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన రంగాల్లో విద్యారంగం ఒకటి. వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. అయితే అది ఆర్థికపరమైన నష్టం కాగా.. విద్యార్థులకు అకడమిక్ పరంగా వెనకడుగు వేసేలా చేసింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో కీలకమైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమై షెడ్యూళ్లు ప్రకటించి, వాటిని వాయిదా వేసి చివరకు రద్దు చేశారు. మొదటి ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఆల్ పాస్‌గా ప్రకటించగా.. రెండో ఏడాది అంతర్గత మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. ఇప్పుడు తాజాగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా మూడు వేవ్‌ల ప్రభావం క్షీణించడం, 90 శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో ఈసారి కచ్చితంగా పరీక్షలు జరగనున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో కూడా కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో తగ్గిన పనిదినాల్లో పూర్తి సిలబస్‌ను కొనసాగించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పడుతుందని భావించి, ముఖ్యమైన పాఠ్యాంశాలను యథాతథంగా ఉంచుతూ.. కొన్ని పాఠ్యాంశాలను కుదించి, 30 శాతం వరకు తగ్గించారు. మరోవైపు గతంలో పదో తరగతి పరీక్షల్లో ఉన్న 11 పేపర్లను ఏడింటింకి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క సామాన్య శాస్త్రం పరీక్ష రెండు పేపర్లు మినహా మిగతా అన్నీ వంద మార్కులకు చొప్పున ఒకే పేపర్ ఉండనున్నాయి. అలాగే దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న గ్రేడ్ సిస్టమ్ స్థానంలో తిరిగి మార్కుల విధానాన్ని తీసుకొస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్ మార్కులు జోడించే విధానం, బిట్లను తొలగించి, మొత్తం ప్రశ్నలే ఉండేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సంస్కరణలను 2019-20 విద్యా సంవత్సరంలోనే ప్రతిపాదించినా ఆ ఏడాది, మరుసటి ఏడాది పరీక్షలు జరగకపోవడంతో ఈసారి పూర్తి స్థాయిలో అమలు కానున్నాయి.
ఇదిలా ఉంటే జేఈఈ పరీక్షల కారణంగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో రెండుసార్లు, ఇంటర్ పరీక్షా తేదీల్లో మూడుసార్లు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు సరళంగా, ఎక్కువ చాయిస్‌లతో ఇస్తే బాగుంటుందని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..