(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) సువర్ణ కాంతుల విద్యుత్ దీపాలంకరణలో… మిరమిట్లు గోలిపే బాణాసంచా వెలుగులు.. రంగురంగుల రాయించ రథంపై పరమేశ్వరుడు పక్కనే సిగ్గులోలుకుతూ కూర్చున్న దుర్గమ్మ తో కలసి కృష్ణమ్మ అలలదారుల్లో హంస వాహనంపై మెల్లమెల్లగా ముందుకు సాగుతున్న అద్భుత దృశ్యాన్ని తనివి తీర చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆకాశాన వెన్నెల వెలుగులు.. తీరాన భక్తకోటి పరవశ కెరటాల నడుమ శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారు హంస వాహనంపై కృష్ణమ్మ వడిలో విహరించారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తకోటి జయ జయ ద్వారాలు వెంటరాగా స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజల అనంతరం కృష్ణానదిలో హంస వాహనంపై ఊరేగించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు అనంతరం సోమవారం సంధ్య సమయాన త్రిలోకసంచారిని త్రిశక్తి రూపిని అయిన కనకదుర్గమ్మ వారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారితో కలిసి విహరించిన తీరు నదీ తీరాన దేదీప్యమానంగా వెలుగొందుతూ కనిపించింది. జై భవాని జై జై భవాని అంటూ భక్తులు ఒకవైపు జేజేలు పలుకుతుండగా అంబరం అంటే రీతిలో సంబరమై తెప్పోత్సవం కృష్ణమ్మ మురిసిపోయేలా కొనసాగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్వహించిన తపోసవ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు.
రంగ రంగ వైభవంగా కొనసాగుతున్న జల విహారాన్ని భక్తులంతా ప్రకాశం బ్యారేజీ దుర్గా ఘాటు కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు జన హారంల ఏర్పడి వీక్షించారు. స్వామి వారిలో ఉత్సవ విగ్రహాలను మొదట మెట్ల మార్గం ద్వారా కనకదుర్గ నగరం నుండి దుర్గా ఘాటుకు తీసుకువచ్చిన వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.