Tuesday, November 26, 2024

AP | ఈ నెల 20 వరకు పది పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ : రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)-1 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలులో మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. సమ్మెటివ్‌ పరీక్షలు ఈ నెల 24 నుంచి డిసెంబరు 6 వరకు కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు పేర్కొన్నా. ఈ నెల 24, 25 తేదీల్లో పదోతరగతి కాంపోజిట్‌ తెలుగు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అన్ని తరగతులవారికి నవంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్ధులకు 28 నుంచి డిశంబరు 2 వరకు జరుగనున్నాయి.

6 నుంచి 10 విద్యార్ధులకు 28 నుంచి డిశంబరు 6 వరకు జరుగుతాయి. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌ టీ-వీలు ఉన్నచోట మాత్రమే టోఫెల్‌పరీక్ష ఉంటుంది. సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన వెయ్యి పాఠశాలల 8, 9 తరగతులకు కూడా ఈ నెల 28 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -

పది పరీక్షల ఫీజు గడువు మరో పది రోజులకు పొడిగింపు..

పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు తొలుత ఈ నెల 10 వరకు ఇచ్చిన గడువును మరో పది రోజులకు పొడిగిస్తూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి. దేవానందరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 నాటికి పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. రూ 50 రుసుముతో ఈ నెల 21 నుండి 25వ తేదీ లోపు, రూ 200 రుసుముతో 26 నుండి 30వ తేదీ లోపు, రూ 500 రుసుముతో డిశంబరు 1 నుండి 5వ తేదీ లోపు చెల్లించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఏడు పేపర్లతో పది పరీక్ష..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌ పేపర్లు యథావిధిగా ఉంటాయి.

ప్రశ్నపత్రాల్లో మార్పులు..

తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి. హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చారు. గతంలో బిట్‌ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement