మచిలీపట్నం, జులై 24( ప్రభ న్యూస్) : కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ ట్ లో సోమవారం స్పందన కార్యక్రమంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగతనం చేయడాన్ని నిరసిస్తూ ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.
పంచాయతీరాజ్ ఛాంబర్ ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచులు స్పందన హాల్లో కలెక్టర్ రాజబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా సర్పంచులు లోపలకు వచ్చి నిరసన తెలియజేస్తూ, సభ వేదిక ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన చేస్తున్న సర్పంచ్ లను సమావేశ మందిరం నుంచి బయటకు పంపించేశారు. అనంతరం తమ సమస్యల పరిష్కరించాలంటూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.