ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఆదివారంతో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకుంది. రాజధానిలో భారీగా పోలీసులను మోహరించారు. రాజధానిలోకి కొత్తవారిని అనుమతించని పోలీసులు.. కరకట్టపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయం చుట్టూ ఇనుప కంచెను ఉంచారు.
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
మరోవైపు అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు పలుచోట్ల నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండిః అమరావతి ఉద్యమానికి 600 రోజులు..