ఏపీ టీడీపీలో గోరంట్ల టెన్షన్ నెలకొంది. సీనియర్ నేత అయిన గోరంట్ల టీడీపీకి గుడ్ బై చెబుతున్నారని ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడుతున్నారంటూ వార్తలు రావడంతో టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
టీడీపీకి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయబోతున్నారనే వార్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. పార్టీకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదని స్పష్ట చేశారు. రాజమండ్రి డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కూడా గోరంట్ల రాజీనామా చేయడం లేదని తెలిపారు.
మరోవైపు గోరంట్ల రాజీనామా చేయబోతున్నారనే వార్త తెలియగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ లో గోరంట్లతో మాట్లాడారు. మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్ రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లారు. ఆయనతో వారిరువురు చర్చలు జరిపారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి అని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. గోరంట్ల ప్రస్తావించిన అంశాలను చంద్రబాబుకు నివేదిస్తామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో తనకు కొన్ని సమస్యలు ఉన్నట్టు గోరంట్ల చెప్పారని తెలిపారు. తనను కొందరు గౌరవించడంలేదని చెప్పారని చినరాజప్ప వెల్లడించారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. సీనియర్ నేతగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా గోరంట్లకు పార్టీలో ఎప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.
అంతకు ముందు.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా గోరంట్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోరంట్లతో అన్ని విషయాలను మాట్లాడామని, ఆయన రాజీనామా చేయబోరని చెప్పారు. ఏ సమస్యలున్నా పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు గోరంట్ల అని కొనియాడారు.
ఈ వార్త కూడా చదవండిః ఏపీ టీడీపీకి షాక్… గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..?