Thursday, November 21, 2024

ఎపిలో దైవ‌ప్ర‌సాదాలకు టెండ‌ర్….

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: పవిత్రమైన దేవాదాయ శాఖను కొంతమంది అధికారులు అపవిత్రం చేస్తున్నారు. తమ సొంత ప్రయోజ నాల కోసం శాఖ ప్రతిష్టతను దిగజారుస్తున్నా రు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ప్రసాదాల సరుకులకు సంబంధించిన టెండర్‌లో కొత్త రూల్స్‌ పేరుతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌లకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో దేవాదాయ శాఖ అక్రమాలకు నిలయం గా మారుతుందన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న నిబంధనలను పక్కనబెట్టి ప్రసాదాలకు సంబంధించి సరుకు సరఫరాకు కొత్త టెండర్‌ విధానాన్ని తెరపైకి తీసుకురావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారడంతో పాటు పలు విమర్శలకు కూడా దారితీుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరేమో గతంలో దేవాదాయ శాఖకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధి కాగా, మరొకరు తాజాగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధి. వీరిద్దరు ఎవరికి వారే దేవాదాయ శాఖపై తమ పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒకరు టెండర్‌ విధానంలో కొత్త రూల్స్‌ను వ్యతిరేకిస్తుండగా, మరొకరు ఆ రూల్స్‌ను సమర్థిస్తూ ఆ దిశగానే టెండర్‌ ప్రక్రియను చే పట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తున్నారు. దీంతో ప్రసాదాల టెండర్లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రూ. 10 కోట్ల వార్షిక టర్నోవర్‌ దాటిన వారే టెండర్లకు అర్హులు
దేవదాయశాఖలో టెండర్ల మాయాజాలంపై విమర్శలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన శ్రీశైలం, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి), ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం శ్రీ వరహా నరసింహ స్వామి ఆలయం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో నైవేద్యం, అన్నప్రసాదం కోసం ఏటా రూ.750 కోట్ల మేర ప్రొవిజన్స్‌(సరుకులు) కొనుగోలు చేస్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి రూ.100 కోట్ల వరకు ఏటా సరుకులు కొను గోలు చేస్తుంటారు. కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో సరుకుల కొనుగోలు ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకమైన ప్రసాదములు, నైవేద్యం, అన్నదానం ఉంటుంది. వీటికి అనుగుణంగా ఆయా ఆలయాలు సరుకుల సరఫరాకు టెండర్లు పిలిచి ఉన్నతాధికారుల అనుమతితో కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు. గతంలో సరుకుల కొనుగోళ్లకు ఏడాదికోసారి విడివిడిగా సంబంధిత ఆలయాల అధికారులే టెండర్లు పిలిచేవారు. ప్రసాదం, అన్నదానం తయారీలో వినియోగించే జీడిపప్పు సహా వివిధ దినుసులకు వేర్వేరు టెండర్లు పిలిచేవారు. ఐటమ్‌ క్వాంటీటీ(సరఫరా చేయాల్సిన క్వాంటిటీ) తద్వారా ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు ఆలయాలకు సరఫరా చేసేవారు.

అనుకూలమైన వారి కోసమే కొత్త రూల్స్‌
గత మూడేళ్లుగా అధికారులు కొత్త నిబంధనలతో ఇద్దరు కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా నిబంధనలు రూపొందించారు. విడివిడిగా సరుకులకు టెండర్లు పిలిస్తే తక్కువ ఉంటుందని కాబట్టి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లుగా నిర్ణయించారు. రూ.10 కోట్ల వార్షిక టర్నోవర్‌ అంటే పేరొందిన వ్యాపారులు వస్తారు తప్ప స్థానికంగా ఉండే చిన్నవ్యాపారులకు సాధ్యం కాడు. పైగా గతంలోలా కాకుండా ఆలయానికి సరఫరా చేయాల్సిన అన్ని సరుకులను ఒకే టెండరుగా పిలుస్తూ వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లుగా నిర్ణయించారు. కేవలం తాము అనుకున్న వ్యక్తులకు టెండరు కట్టబెట్టేందుకే రూ.10 కోట్లను వార్షిక టర్నోవర్‌గా నిర్ణయించినట్లు విమర్శలు వస్తున్నాయి. సరుకుల టెండర్లలో వస్తున్న ఆరోపణలపై ఇటీవల దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ టెండర్లను మూడు రకాలుగా విభజించి అమలు చేస్తామని ఇటీవల స్పష్టం చేశారు. వ్యాపారి వార్షిక టర్నోవర్‌ రూ.కోటి వరకు ఒకటి కాగా రూ.3కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా సరుకుల అవసరాన్ని బట్టి కేటగిరీగా విభజించి టెండర్లు పిలుస్తామని చెప్పారు. తద్వారా ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే అధికారులు విటిని అమలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement