Friday, November 22, 2024

జీతవెూ రామచంద్రా! ఆలయ ఉద్యోగులకు వేతనాల వేదన..

రాష్ట్రంలో ఆలయ ఉద్యోగులు ‘జీతమో… రామచంద్రా….’ అంటూ ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి జీతాలు రాక, చేయి చాచేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చి నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా చెల్లించక పోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అసలే చాలీచాలని జీతాలు.. ఆపై మాతృసంస్థ నుంచే జీతాలు తీసుకోవాలంటూ పై అధికారులు.. పాలక మండలి చెపుతుండటంతో పాలుపోక ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6(బి), 6(సి) ఆలయాల్లో ఈ పరిస్థితి ఉంది. గతంలో పలు ఆలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను ధూపదీప నైవేద్యాలకు సైతం ఆదాయం లేని స్థితిలో వివిధ ఆలయాలకు పంపారు. వీరిలో అర్చకులు, గుమాస్తాలు ఉన్నారు. ఈ తరహా మాతృసంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేక వివిధ ఆలయాలకు పంపిన ఉద్యోగులు సుమారుగా ఆరు వేల వరకు ఉంటారు. వీరి నెలవారీ జీతాలు రూ.20వేల లోపే. వీరిలో రెండు, రెండున్నర వేల మంది ఉద్యోగులకు తొమ్మిది మాసాల నుంచి ఏడాదికి పైగా జీతాలు లేవు. గతంలో పని చేస్తున్న సంస్థ, ఆలయంలోనే వీరు జీతాలు తీసుకునే వారు. ఇప్పుడు అలా వీలులేదని చెపుతూ పాలక మండలి అభ్యంతరాల పేరిట అధికారులు మాతృ సంస్థలోనే జీతాలు తీసుకోవాలంటూ చెపుతున్నారు. అసలు ఆదాయమే లేని స్థితిలో ఆయా సంస్థల నుంచి డెప్యుటేషన్‌పై ఇక్కడ విధులు నిర్వహిస్తుంటే.. తిరిగి అక్కడికి వెళ్లి ఎలా జీతాలు తీసుకోవాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఆలయ చిరుద్యోగి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

ఎవరీ ఉద్యోగులు..

గతంలో వీరంతా చిన్న ఆలయాల్లో చిరుద్యోగులుగా చేరినవారు. ఆలయాలకు ఆదాయం తగ్గడం, ఆదాయ వనరులుగా ఉన్న ఆస్తులు కోర్టు వివాదాలకు వెళ్లడంతో సంబంధిత సంస్థల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉద్యోగాలు చేసే వీరిని సమీపంలోని కొన్ని ఆలయాలకు ఆరువేల మంది వరకు ఉద్యోగులను డెప్యుటేషన్‌పై పంపారు. పని చేస్తున్న ఆలయంలోనే నిబంధనల మేరకు వీరు జీతాలు తీసుకుంటున్నారు. గతంలో ఆయా ఆలయాల ఆదాయం తగ్గినప్పుడు దశల వారీగా జీతాలు చెల్లించేవారు. ఏదో ఒకరోజు వస్తుందనే ఆశతో వీరంతా విధుల నిర్వహణలోనే ఉన్నారు. ఎటొచ్చి ఈ సమస్య ఏడాది కాలంగా తలెత్తుతోంది. ఇతర ఆలయాల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు పాలక మండలి అంగీకరించడం లేదంటూ పలువురు కార్యనిర్వహణా ధికారులు చెపుతూ ఆపేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు చొరవ తీసుకొని సమస్య తలెత్తకుండా చూస్తున్నప్పటికీ..పలు ఆలయాల్లో మాత్రం ఉద్యోగులను పట్టించుకున్న వారు లేరు. దీంతో తొమ్మిది నుంచి 12 నెలల వరకు వీరికి జీతాలు పెండింగ్‌లో ఉన్నట్లు చెపుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి…

గతంలో సమస్యను ఆలయ ఉద్యోగులు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ వాణీమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. చిన్న ఆలయాల ఉద్యోగులు, అర్చకుల పరిస్థితి విని ఆమె కూడా చలించిపోయినట్లు ఉద్యోగుల సంఘం నేతలు చెపుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఆమె ఇచ్చిన హామీ కూడా ఇప్పుడు అమలు కావడం లేదని అంటున్నారు. గతంలో హైకోర్టు సైతం ఆలయ ఉద్యోగుల జీతాల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఏదో ఒక నెపంతో ఉద్యోగుల జీతాలు ఆపడం అంటే జీవించే హక్కును కాలరాయడమే అంటూ వివిధ సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అటు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు..ఇటు ఉన్నతాధికారుల ఆదేశాలు కూడా అమలుకు నోచుకోక ఆలయ ఉద్యోగులు ఆకలి కేకలు పెడుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement