తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొంగమందు కురుస్తోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 6 డిగ్రీల సెల్పియస్ నమోదు కాగా.. గిన్నెదరిలో 6.4 , సోనాల 7.2, లొకారి కే 7.5, బెల లో 7.6 చెప్రాల లో 7.9 లుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లాలో 8.1, రంగారెడ్డిలో 8.5, నాగర్ కర్నూల్లో 9.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 10 నుంచి 13 డిగ్రీలు నమోదైయ్యాయి.
రాజధాని హైదరాబాద్ కూడా చలితో వణికిపోతోంది. ఉదయం 10 వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉప్పల్, నాగోలు, హయత్నగర్, తుర్కయాంజల్, బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, దుండిగల్, అల్వాల్, మల్కాజిగిరి, కుషాయిగూడ, తదితర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, ఈశాన్య చలిగాలులు చలి తీవ్రతను మరింత పెంచాయి.
ఇక, ఆంద్రప్రదేశ్ లో కూడా చలి తీవ్రత రోజురోజుకు పెరిగుతోంది. విశాఖలోని మన్యంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. చింతపల్లిలో 8.7, మినుములూరులో 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరో మూడు రోజులు ఇదే తీవ్ర పరిస్థితి కొనసాగనున్నది. మూడు రోజుల తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోయి చలి బాగా పెరగడంతో జలుబు, దగ్గు, చలి జ్వరం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు, వాతావరణ నిపుణులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..