Saturday, November 23, 2024

Telugudesam – 25 నుంచి ‘నిజం గెల‌వాలి’ నారా భువ‌నేశ్వ‌రి యాత్ర‌…

అమ‌రావ‌తి – టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి ఇప్పటిదాకా ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యాక ఆమె బయటికి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో, ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని లోకేశ్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. తిరుమల నుంచి అదే రోజున బయల్దేరి నారావారిపల్లెకు వెళతారని లోకేశ్ చెప్పారు.
మంగళగరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో భావోద్వేగానికి లోనైన లోకేష్.. సమావేశ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల కోసం పోరాడారని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డని అన్నారు. నీతి నిజాయితీయే చంద్రబాబు ఆయుధం అని చెప్పారు. రాష్ట్ర ప్ర‌గ‌తి-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు ప్ర‌క‌ట‌న‌ అన్నారు.

తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని లోకేష్ చెప్పారు. తన తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారని అన్నారు. తన తల్లి రాజకీయంగా ఏనాడైనా బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు. తన తల్లికి సేవా కార్యక్రమాలు తప్ప..రాజకీయాలు తెలియదని అన్నారు. తన తల్లి భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణిలు కలిసి చంద్రబాబు నాయుడును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి, భార్య చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏ అని విమర్శించారు.

పుంగ‌నూరు ఘ‌ట‌న వైసిపి అరాచ‌కాల‌కు పరాకాష్ట …భువనేశ్వ‌రి..

స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు సంఘీభావంగా కొందరు టీడీపీ మద్దతుదారులు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే వారిని పుంగనూరు మండలంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో దూషించి, పసుపు చొక్కాలు విప్పించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన పట్ల నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కాలు విప్పించిన ఘటన చూసి తాను షాక్ కు గురయ్యానని వెల్లడించారు. ప్రజలందరినీ ఇది నివ్వెరపరిచిందని తెలిపారు.
“రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే! తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో పెడితే బిడ్డలైన కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా? నడిరోడ్డుపై బూతులు తిడుతూ ఆ సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే” అంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement