రాజమండ్రి – పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లను ఉద్దేశించి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ప్రారంభం నుండి లోకేశ్ కు వెన్నంటి ఉన్నారంటూ యువగళం వాలంటీర్లకు కృతజ్ఞతలు చెప్పారు. చేయని నేరానికి జైలుకు వెళ్లడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల కష్టం, త్యాగం తాము ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని భువనేశ్వరి అన్నారు.
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా పలువురు యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. భీమవరం నియోజకవర్గం గునుపూడిలో యువగళం పాదయాత్ర సందర్భంగా 43 మంది వాలంటీర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నెల రోజులుగా జైల్లో ఉన్న వారు ఈ రోజు బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం రాజమండ్రిలో నారా భువనేశ్వరిని కలిశారు.
వారిని నారా భువనేశ్వరి ఎంతో ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నారా లోకేశ్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని కొనియాడారు. యువగళంలో లోకేశ్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. .
‘‘వాలంటీర్లపై అక్రమ కేసులు మమ్మల్ని ఎంతో బాధించాయి. మీరు జైలు నుండి విడుదల అవుతున్నారని తెలియగానే మిమ్మల్ని చూడాలని చెప్పా. దాడి చేసిన వారిని వదిలిపెట్టి మిమ్మల్ని అకారణంగా జైల్లో పెట్టారు. పార్టీకి మీరు చేస్తున్న సేవ మర్చిపోలేనిది. మీ అరెస్టుతో మీ తల్లిదండ్రులతో పాటు నేనూ ఎంతో బాధపడ్డాను’’ అని భువనేశ్వరి అన్నారు.