Saturday, November 23, 2024

జలశక్తి గెజిట్ నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల అలసత్వం.. 14 అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ అమలుపై తెలుగు రాష్ట్రాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా-గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రూ. 200 కోట్ల మూలధనాన్ని ఇంకా అందించలేదని స్పష్టం చేసింది. గోదావరి, కృష్ణా నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మించదలచిన ప్రాజెక్టులకు నిర్వహణ అనుమతులు బోర్డుకు ఇంకా సమర్పించలేదని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలుగు రాష్ట్రాలు చెల్లించాల్సిన మూలధన వివరాలు, ప్రస్తుతం ఆ నదులపై నిర్మాణం జరుగుతున్న, పూర్తైన అనుమతులు లేని ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని సోమవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రశ్నించారు.

జులై 15, 2021వ సంవత్సరంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇరు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులను పూర్తిగా తక్షణమే నిలిపివేయాలని, లేనట్లయితే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉందని ఆయన జవాబిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏ విధమైన పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటివరకు సమర్పించలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 అనుమతులు లేని ప్రాజెక్టులను నిర్మిస్తుండగా, వాటిలో పట్టిసీమ ఎల్ఐఎస్ ప్రాజెక్టుకు మాత్రమే పూర్తి స్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పించినట్టు బిశ్వేశ్వర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేని చిన్న, పెద్ద ప్రాజెక్టులను 10 వరకు నిర్మిస్తుండగా… వాటిలో 6 ప్రాజెక్టులకు మాత్రమే పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు అందించినట్టు కేంద్ర మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement