అమరావతి, ఆంధ్రప్రభ : జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్ డ్యాం నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడటంపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అభ్యంతరం తెలియజేయనున్నారు. ఈమేరకు ఏపీ జలనవరుల శాఖ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి ఈనెల 4వ తేదీనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవద్దని బోర్డును ఆయన తన లేఖలో కోరారు. ఈక్రమంలోనే మే నెల 6వ తేదీన జరగనున్న కేఆర్‌ఎంబీ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ అధికారులు మరోమారు ప్రస్తావించనున్నారు.
అయితే, విద్యుత్‌ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేఆర్‌ఎంబీకి ఇప్పటికే విన్నవించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆపనిని చేస్తూనే ఉంది. ఈక్రమంలోనే సదరు సమస్యను మరోసారి కేఆర్‌ఎంబీ సమావేశంలో లేవనెత్తేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నారు. తద్వారా ప్రాజెక్ట్ నుండి నీటిని వాడటం ఆపివేసి, వేసవిలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తాగు మరియు సాగు అవసరాలకు నీటి సంక్షోభాన్ని నివారించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..