అమరావతి, ఆంధ్రప్రభ : తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్‌లో జరిగే ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో అభ్యర్ధుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మరింత అప్రమత్తమైన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుశాఖలు బోర్డర్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు, భద్రతపరమైన చర్యలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతోపాటు తెలంగాణాలో ఎన్నికల నగారా మోగిన మీదట నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల సంఘం వివిధ శాఖలతోపాటు ప్రధానంగా పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ ఎప్పడైతే మొదలైందో మరింత దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం రెండు రాష్ట్రాలకు సంబంధించి వివిధ శాఖల అంత:రాష్ట్ర సమన్వయ సమీక్షా సమావేశాలకు ఉప క్రమించింది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా డబ్బు, మద్యం అక్రమ రవాణా నియంత్రించేందుకు చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయడంతోపాటు కొత్త చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలని సరి హద్దు రాష్ట్రాలను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయన ఇటీవల ఢిల్లీ నుంచి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు వాటి సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, సీఈఓలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఎన్నికలు జరిగే తెలంగాణా రాష్ట్ర అధికారులతో ఇప్పటికే సమన్వయంతో ఉన్నామని సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు పటిష్టం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వి వరించారు. ఈ నేపధ్యంలో డీజీపీ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తెలంగాణా, ఏపీ సరిహద్దు జిల్లా ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ అధికారులకు బోర్డర్‌లో తనిఖీలు, భద్రతకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
రెండు రాష్ట్రాల అధికారుల భేటీ..
ఏపీ, తెలంగాణా బోర్డర్ గ్రామాలలో ఎటు-వంటి అక్రమ రవాణా , అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ అధికారులు మరింత కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. సత్తుపల్లి, సూర్యాపేటలో జరిగిన వివిధ శాఖల అంత:రాష్ట్ర సమన్వయ సమీక్షా సమావేశాలకు విజయవాడ డిప్యూటి పోలీస్ కమీషనర్ అజిత వేజెండ్ల హాజరై తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు మార్గదర్శకాల గురించి చర్చించారు.
లా అండ్ ఆర్డర్, ఎస్‌ఈబి సంయుక్తంగా ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే గత 14 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా బోర్డర్ గ్రామాలలో 12 చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయడంతోపాటు 96 కార్దన్ సెర్చ్‌లు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 350 కేసులు నమోదు చేసి 360 మందిని అరెస్ట్ చేశారు.13 వాహనాలు, 4848 మద్యం సీసాలు, 104.5 లీటర్ల నాటు- సారా, 255 కేజీల గంజాయి సీజ్ చేశారు. 848 మంది వ్యక్తులపై బైండోవర్ చేయడంతోపాటు-, 133 లైసెన్స్‌డ్ వెపన్స్ డిపాజిట్ చేయించుకున్నారు.