Wednesday, November 20, 2024

Tekkali …. నాన్నే కావాలి …. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరు..

రోడ్డెక్కిన విభేదాలు..
తండ్రి కోసం కుమార్తెలు నిర‌స‌న‌లు
త‌మ ఇంటికి రావాలంటూ ఆయ‌న ఇంటి ముందు ధర్నా
మ‌రో మ‌హిళ‌తో త‌మ తండ్రికి సంబంధం
అందుకే త‌మ‌ను దూరం పెట్టారంటూ ఆవేద‌న

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – శ్రీకాకుళం – శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో వరుసగా ఇంచార్జ్ లను వైసీపీ మార్చింది. ఎన్నికల్లో తనకి టిక్కెట్ కావాలని దువ్వాడ వాణి కోరింది. లెకపోతే భర్తపై రెబల్ గా పోటీ చేస్తానంటూ గతంలో లీకు ఇచ్చింది.. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం సర్ది చెప్పడంతో వాణి వెనక్కి తగ్గింది.

- Advertisement -

అయితే, తండ్రి దువ్వాడ శ్రీనివాస్ తమ వద్దకు రావాలంటూ గ‌త రాత్రి నుంచి దువ్వాడ కార్యాలయం ముందు ఆయన ఇద్దరు కూతుర్లు నిరసనకు దిగారు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఆందోళన చేశారు. తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదనేది ఆయన కుమార్తెలు హైందవి, నవీన ల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి కారులో వచ్చారు. వారు తలుపులు తీయకపోవడంతో ఇంటి బయటే కారులో నిరీక్షించారు. రాత్రి ప‌దిగంట‌ల వ‌ర‌కు పడిగాపులు పడినా దువ్వాడ నుంచి స్పందన లేదు. ఎంత సేపటికీ దువ్వాడ శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో అర్థరాత్రి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ సంద‌ర్భంగా పెద్దకుమార్తె హైందవి మాట్లాడుతూ తన భర్త తండ్రి చనిపోయినా.. కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదని వాపోయింది. తామెన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపినా వేటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేటు తీసి లోపలికి వెళ్తామన్న భయంతో . లోపలివైపు తాళాలు వేసేసుకున్నారని వాపోయిందామె.

దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. అవి ఇప్పుడు బయట పడ్డాయి. శ్రీనివాస్ కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదని ఆయన కుమార్తెలు చెబుతున్నారు. కాగా.. మరో మహిళతో ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ తండ్రి కలిసి ఉంటున్న మహిళకు గతంలోనే పెళ్లై పిల్లలుకూడా ఉన్నారని, తమ తండ్రిని ట్రాప్ చేసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

ఆయనతో కలిసి ఉండాలని లేదు..
దువ్వాడ శ్రీనివాస్ మరో స్త్రీ తో కలిసి ఉండటంపై భార్య వాణి స్పందించారు. తామిద్దరిదీ ప్రేమ వివాహమని చెప్పారామె. తన తల్లిదండ్రులు ఒక పాప పుట్టాక కూడా పై చదువులు చదువుకోమని చెప్పినా తనకు బంధాలు, విలువలు అడ్డొచ్చాయన్నారు. ఆయనలో కోపం చూశానని, తనను హెరాస్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాలతో తామెంతో నష్టపోయామని, ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోయారని వాపోయారు. దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేరే ఆమెతో ఉండటం చూసిన వారంతా తనకు చెప్పారని, వారంతా అసహ్యించుకునే విధంగా నడుచుకున్నారని తన దృష్టికిి వచ్చిందన్నారు.


ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ కుటుంబం పరువుపోతోందన్నారు. ఆయన నుంచి తమకెలాంటి ఆస్తులు రాలేదని, ఆయన టెక్కలి వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి తనకొక్క రూపాయి కూడా అక్కర్లేదని, పిల్లల బాధ్యత మాత్రం ఆయనే చూసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement