అమరావతి, ఆంధ్రప్రభ : కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ఓ తహశీల్దారుకు హైకోర్టు జైలు, జరిమానా విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లా సీకే దిన్నె మండలం చెర్లోపల్లి గ్రామంలో గల తమ పట్టా భూమిని అధికారులు రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూమిగా మార్చారని దీన్ని సవరించి పట్టా భూమిగా చూపాలంటూ గ్రామానికి చెందిన సోమిశెట్టి హరగోపాల్, మరో వ్యక్తి జిల్లా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక విచారణ జరిపిన కమిటీ హరగోపాల్ తదితరుల భూమిని డాటెడ్ ల్యాండ్‌గా రికార్డుల నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదు.
దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయ స్థానం రికార్డులను అంతకు ముందున్నట్లుగా సవరించాలని ఆదేశించింది. అయినా అధికారులు పెడచెవిన పెట్టటంతో అప్పటి తహశీల్దారును ప్రతివాదిగా చేరుస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపిన అనంతరం శుక్రవారం తీర్పును వెలువరించారు. కోర్టు ధిక్కరణ కింద పూర్వపు తహశీల్దారు బీ మహేశ్వరరెడ్డికి ఆరు నెలలు జైలు, రూ. 2వేల జరిమానా విధించారు. ఈ తీర్పుపై అప్పీల్ వెళ్లేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాల పాటు నిలుపుదల చేశారు.