అమరావతి – ఏపీలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి.. 19న నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21గా పేర్కొన్నారు. డిసెంబర్ 5 (గురువారం)న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
గతంలో తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ తరఫున గెలిచిన యూటీఎఫ్ నేత షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.