విజయనగరం, ప్రభన్యూస్ : వేతన సవరణ అంశానికి సంబంధించి ప్రభుత్వ అనుచిత పోకడలను నిరసిస్తూ యుద్ధానికి సన్నద్ధమయ్యాయి ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు. సర్కార్‌తో యుద్ధమే శరణ్యమని భావించిన పీఆర్‌సీ ఉద్యమ కమిటీ ఆమేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన వైనం తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఉద్యమ కమిటీ తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంది. సోమవారం రాష్ట్ర స్థాయిలో ఛీఫ్ సెక్రటరీకి యాక్షన్ నోటీస్ సమర్పించి ఆపైన మంగళవారం జిల్లా కేంద్రాల్లో ర్యాలీ,ధర్నాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది పీఆర్‌సీ ఉద్యమ కమిటీ. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ర్యాలీని ప్రారంభించనున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు కలెక్టరేట్ వరకు కొనసాగిస్తాయి. ఆమేరకు సోమవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులందరికీ స్వయంగా పిలుపు చేశారు పీఆర్‌సీ ఉద్యమ కమిటీ నాయకులు.
నిన్న అన్ని తాలూక కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పిస్తారు. ఈనెల 27న గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో రిలే నిరాహారదీక్ష చేపడతారు. 30వ తేదీ వరకు ప్రతి రోజూ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. వచ్చే నెల 3న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే నెల 5న సహాయ నిరాకరణలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన యాప్స్‌ను డౌన్ చేయనున్నారు. వచ్చే నెల 7న స్ట్రైక్‌లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించిన పీఆర్‌సీ ఉద్యమ కమిటీ. మొత్తం మీద పీఆర్‌సీ విషయంలో జగన్ సర్కార్ అనుసరించిన పోడకలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను, పింఛనర్ల సంఘాలను నిరుత్సాహపరచినట్లయింది. దీంతో వారంతా అనివార్యంగా పోరాటానికి సన్నద్ధమయ్యారు. మరి ప్రభుత్వం ఈ పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకుంటుందో వేచి చూడాల్సిన అంశమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..