ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ… తన హయాంలో రైతులకు రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. మహిళలను, యువతను, రైతులను టీడీపీ ప్రభుత్వం మోసి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ పథకాలను విమర్శించి, ఎగతాళి చేసిన వ్యక్తే.. ఇప్పుడు పేర్లు మార్చి, అవే పథకాలను పెడతామంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్దితిలో లేరని.. ముఖ్యంగా మహిళలు బాబును నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మాయలోళ్ల మాటలు నమ్మి, వారి గారడీలో పడొద్దని సూచించారు. మహిళలు, యువతకు తమ వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అంతకుముందు కూడా.. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్లలో ఒకరైన నివాసం ఉంటున్నారా అని నిలదీసిన ఆయన.. టిడ్కో లేఔట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.