Saturday, November 23, 2024

Delhi | పోలవరం లేట్​కి టీడీపీ, వైసీపీ కారణం:బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు జాప్యానికి నాటి తెలుగుదేశం, నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, పోలవరం జాతీయ ప్రాజెక్టు అని చెబుతూ కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రెండు పార్టీలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా అప్పులు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రం చేస్తున్న అప్పుల గురించి ప్రజలందరికీ చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఒక ఛార్జీషీట్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మతం మీద, ఆలయాల మీద దాడులు పెరిగాయని నిందించారు. రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత సీఎం జగన్ కోల్పోయారని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల నియోజకవర్గాల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎంతుందో తెలిసొచ్చిందని, అధికార పార్టీ ఎన్నిరకాలుగా అడ్డదారులు తొక్కినా సరే వ్యతిరేకతను ఆపలేకపోయారని అన్నారు.

మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్సీపీ సహాయం అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ‘కేరాఫ్ అడ్రస్’ లేని పార్టీ నేత పరకాయ ప్రవేశం చేసినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవడం అనేది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధంలో భాగమే తప్ప అది బీజేపీ – వైఎస్సార్సీపీల మధ్య సంబంధం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినప్పుడు ఇవ్వడం పాలనలో భాగమని, వాటికి రాజకీయాలను ముడిపెట్టడం సరికాదని అన్నారు. బీజేపీ, జనసేనతో పొత్తులో ఉందని, రానున్న ఎన్నికల్లో కూడా కలిసే ప్రయాణం సాగిస్తామని భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు. తమ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వైస్సార్సీపీ గుండాల అరాచకం నశించాలి
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై అమరావతిలో వైస్సార్సీపీ కార్యకర్తలు జరిపిన దాడిని భానుప్రకాశ్ రెడ్డి ఖండించారు. శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దాడి ఒక హేయమైన చర్య అని, రాజకీయాల్లో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రశాంతమైన రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా మార్చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, దాడిలో పాల్గొన్నవారిని తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement