Friday, November 22, 2024

TDP Warns – ఇసుక బ‌కాసురుల‌ను ప్ర‌జాకోర్టులో శిక్షిస్తాం … చంద్ర‌బాబు

అమరావతి: వైకాపా నేతలు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని.. సీఎం జగన్‌ ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ చేశార‌ని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ఇసుక బ‌కాసురుల‌ను ప్రజాకోర్టులో శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు..
పార్టీ కార్యాల‌యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఇసుక తోడేసి విధ్వంసం చేస్తున్నారు. 2022 నుంచి పూర్తిగా వైకాపా నేతలకే ఇసుక దందా అప్పగించారు. ఇసుకలో వాటాల కోసం విచ్చలవిడిగా వ్యవహరించారు. ఇసుక రీచ్‌లలో ఒక మీటర్‌ కంటే ఎక్కువ లోతు తవ్వకూడదు. నీరు ఉన్న చోట ఇసుకను తవ్వకూడదనే నిబంధన ఉంది. కృష్ణా నదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తవ్వేశారు. అన్ని నిబంధనలు ఉల్లంఘించి కోట్ల టన్నుల ఇసుక దోపిడీ చేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

‘‘జగన్ రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందుల్లో పెట్టారు. టీడీపీ విధానం కంటే మెరుగైన విధానం తెస్తా.. ఇసుకను డోర్ డెలివరి చేస్తానన్నారు. 130 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.. గుండ్లకమ్మ గేటు కొట్టుకెళ్లింది. అన్నమయ్య డ్యామ్ ఘటనలో 48 మంది చనిపోయారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత ఇసుక విధానం రద్దు చేశారు. ఇసుక సరఫరాకు కొత్త విధానాలంటూ జగన్ రకరకాల నాటకాలు ఆడారు. ఏపీఎండీసీ, జేపీ వెంచర్స్, టర్న్‌కీ సంస్థ అంటూ ఇప్పుడు ఎమ్మెల్యేలకే ఇసుక తవ్వకాలు అప్పజెప్పారు. వాటాలు వేసుకుని సీఎం జగన్-ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారు. జగన్‌కు ఆహారం ఇసుక, గనులు. జగన్‌కు దాహం వేస్తే మద్యం. జగన్‌కు ఫలహారం భూ సంపద. విధ్వంసమే జగన్ ఆశయం. భూమి మీద ఏ స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించవచ్చో.. అన్నీ చేసేశారు. రూ. 40 వేల కోట్ల మేర ఇసుకలో దోపిడీ చేసిన ఇసుకాసురుడు జగన్. 70 నదుల్లో లభించే సహజ సంపద ఇసుకను జగన్ దోచుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం అవలంభించాం. టీడీపీ ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం ఊపందుకుంది. టీడీపీ ఇసుక విధానం వల్ల డ్వాక్రా మహిళలకు.. పంచాయతీలకు లబ్ది చేకూర్చేలా ఉండేది. పర్యావరణానికి ఇబ్బందులు కలిగేలా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కృష్ణా నదులో బ్యారేజీలు కట్టేసి మరీ ఇసుకను తవ్వేస్తున్నారు. మెషీన్లు పెట్టి ఇసుకను దోచేస్తున్నారు.’’ అని చంద్రబాబు వివరించారు.

‘‘ఎన్జీటీ తప్పు పట్టి ఇసుక తవ్వకాలు ఆపమని ఆర్డర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఆదేశిస్తే.. దాన్ని వక్రీకరించి.. చిత్తూరుకే పరిమితం చేశారు. దీంతో మరోసారి ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ ర్యాంపులోనే 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేస్తున్నారు. ఇసుకను జే గ్యాంగ్, పెద్దిరెడ్డి దోపిడీ చేశారు. ఇసుక వ్యాపారులు కప్పం కట్టలేక వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జగన్ బంధువు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఇసుకను దోపిడీని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు.. వేధిస్తున్నారు. వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దొంగ బిల్లులతో ఇసుక దోపిడీ చేస్తున్నారు. జీఎస్టీ లేకుండా బిల్లులు ఇచ్చేశారు. దొంగతనాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఆ పని చేయడం లేదు. పోలీసులు దొంగలకు ఎస్కార్ట్ చేస్తున్నారు. దొంగలకు సహకరిస్తే శిక్షలు తప్పవు. ఓటర్ల జాబితాలో అవకతవతలు చేసిన అధికారులేమయ్యారో అధికారులు గమనించాలి. తప్పులు చేసేవారెవ్వరూ తప్పించుకోలేరు.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement