Tuesday, November 19, 2024

TDP vs YCP – పెన్ష‌న్ల పంపిణీపై వైసిపి – టిడిపి ల‌డాయి..

అమ‌రావ‌తి – పెన్ష‌న్ ల పంపిణీలో వాలంటీర్ల‌ను దూరంగా ఉంచాల‌న్న నిర్ణ‌యంపై వైసిపి , టిడిపి నేత‌ల మ‌ధ్య యుద్దం తార‌స్థాయికి చేరింది.. చంద్ర‌బాబే పెన్ష‌న్ల‌ను నిలిపి వేయించారంటూ వైసిపి అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే , వాలంటీర్ల లేకుండా ఇంటింటి పంపిణీ చేయ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ కు చేత‌కాదా అంటూ టిడిపి నేత‌లు కౌంటర్ ఇస్తున్నారు..

పెన్ష‌న్లు ఇస్తుంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నారు..

వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానపడి లేవలేని స్థితిలో ఉన్న వృద్దులకు వలంటీర్ల ద్వారా వారి గడప ముందుకు వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేని చంద్రబాబు అండ్ కో కుట్రలు చేసి పెన్షన్‌ను అడ్డుకోవడం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. గ్రామ సచివాలయం వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోలేని వృద్దులను మంచంపై పడుకోబెట్టి సచివాలయం వరకూ తీసుకెళ్ళే నిరసనకు విజ‌య‌సాయిరెడ్డి మద్దతు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని కుట్రపూరితమైన చంద్రబాబు ఫిర్యాదులను నమ్మకూడదని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. మీ పదవీకాంక్ష కోసం ఎంతమంది పెన్షనర్ల ప్రాణాలు బలి తీసుకుంటావు చంద్రబాబు…? అంటూ విజ‌య‌సాయిరెడ్డి నిల‌దీశారు.

- Advertisement -

ఈసీ ఆదేశాల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మంగ‌ళం .. .
ఈసీ ఆదేశాల మేరకు ఏపీలో ఇవాళ సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, వైసీపీ కార్యకర్తలు ఆ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పెన్షన్లకు సంబంధించి నగదు ఇప్పటికీ నగదు సచివాలయాలకు అందలేదని వర్ల రామయ్య తెలిపారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను మంచాలపై సచివాలయాలకు మోసుకొస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇళ్ల వద్దే పెన్షన్లు అందించేలా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మంచాల‌పై తీసుకొస్తారా… వైసిపిపై ఉమా ఫైర్

ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా స్పందించారు. పెన్షన్ల కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెడతారా? ప్రచార పిచ్చితో వృద్ధులను మంచాలపై ఊరేగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు, అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా? అని ధ్వజమెత్తారు. తొమ్మిది మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్నా ఇంకా మార్పు రాదా? అని ప్రశ్నించారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టారని, దాంతో సచివాలయాలకు ఇంకా పెన్షన్ డబ్బు చేరలేదని ఆరోపించారు.

కొన్ని ప్రాంతాల‌లోనే ప్రారంభం …

ఇది ఇలా ఉంటే నేటి ఉదయం నుంచి మొదలు కావాల్సిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పెన్షన్ల కోసం ఉదయం నుంచే సచివాలయాలకు పెన్షన్‌దారులు చేరుకున్నారు. సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే డబ్బులు రాలేవని, మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ ప్రక్రియ మొదలువుతుందని సచివాలయం సిబ్బంది చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పారంటూ పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. చివరకు పెన్షన్ పంపిణీ లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఈరోజు నుంచి ఈనెల 6వరకు నాలుగు రోజుల పాటు పెన్షన్ పంపిణీ జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement