అమరావతి – నామినేషన్లు ఉపసంహరించుకోని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై టీడీపీ అధిష్టానం వేటు వేసింది. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలువురుని పార్టీ సస్పెండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు
ఇకపోతే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న ఆరు స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకోలేదు. తాము సైతం బరిలో ఉంటామని నిలిచారు. ఉండి, గన్నవరం, విజయనగరం, కావలి, పోలవరంతోపాటు మెుత్తం ఆరు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద కూటమికి తప్పడం లేదు. విజయనగరం నియోజకవర్గం నుంచి మీసాల గీత నామినేషన్‌ను విత్ డ్రా చేసుకుంటారని అంతా భావించారు.. కానీ అది జరగలేదు. దీంతో అక్కడ కూడా రెబెల్స్ బెడద తప్పడం లేదు.
అలాగే ఉండి సీటు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. వరుసగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందున్నారు. 2014 ఎన్నికల్లో శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో రామరాజు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో శివరామరాజు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. దీంతో శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఇకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి టికెట్ మళ్లీ మార్చాల్సి వచ్చింది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎంపీ రఘురామ అటు రామరాజు ఇటు శివరామరాజులతో మాట్లాడారు. ఈ క్రమంలో శివరామరాజు విత్ డ్రా చేసుకుంటారని అంతా భావించారు. కానీ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోవడంతో త్రిముఖ పోటీ నెలకొన్నట్లు అయ్యింది. శివరామరాజు రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో అటు మీసాల గీత, ఇటు వేటుకూరి వెంకట శివరామరాజులను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్‌లను సైతం టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.