నంద్యాల – జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు టిడిపి సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ తప్పు చేయనప్పుడు దేవుడికైనా భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసును పెట్టారని ఆయన ఆరోపించారు.
టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ రేపటి నుంచి చేపడుతున్న వారాహి నాలుగో దశ యాత్రకు మద్ధతు ఇవ్వాలని నిర్నయించినట్లు బాలకృష్ణ చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలయ్య తెలిపారు. ఇవాళ్టీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.