అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పాలనలో చేసిన పాపాలు పోలవరం ప్రాజెక్టును వెంటాడుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో గురువారం ఆయన మాట్లాడుతూ పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినటానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమానే అవినీతే ప్రధాన కారణమన్నారు, స్పిల్ వే పనులు పూర్తి కాకుండానే కమిషన్లకు కక్కుర్తి పడి తొందరగా, సులభంగా పూర్తయ్యే నిర్మాణాలకు అనుమతిచ్చినందువల్లనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. అయిదేళ్లు మంత్రిగా ఉన్న ఉమ డబ్బు సంచులు మోయటానికి పరిమితమయ్యారని విమర్శించారు.
పోలవరం నిర్మాణంపై తాను ఏ అంశంపైనయినా చర్చకు సిద్ధమేనన్నారు. కాఫర్ డ్యాం సగంలో ఉండగానే డయా ఫ్రం వాల్ నిర్మించారు..స్పిల్ వే, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పూర్తి చేయలేదు..ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టకుండా డయా ఫ్రం వాల్ నిర్మించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వరదలకు ముందే దాన్ని క్లోజ్ చేస్తే గ్రామాలకు ముంపు వచ్చే ప్రమాదం ఉన్నందున సహాయ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) పనులు పూర్తి చేసి కాఫర్ డ్యాం క్లోజ్ చేశామన్నారు. వాస్తవం ఇలా ఉంటే..తమ పాపాలను వైసీపీ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
పోలవరాన్ని ఏటిఎంగా మార్చకుని తాము చేసిన కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో డయాఫ్రం వాల్ దెబ్బతినటానికి వైసీపీ ప్రభుత్వమే కారమమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి విమర్శించారు. చంద్రబాబుకు అనకూలంగా పోలవరంపై వాస్తవాలను దాచిపెట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే పన్నాగాలు ఎక్కువకాలం చెల్లువాటు కావన్నారు. 2018లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న చంద్రబాబు తాను అధికారం వీడే సమయానికైనా ఎంత శాతం పనులు చేశారో చెప్పాలన్నారు.