మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన కుటుంబ సభ్యులతో కలిసి వంగలపూడి అనిత మహిళా కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. కమిషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. ఈ నిరసనలో విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
మరోవైపు ఇవాళ విచారణకు రావాలని చంద్రబాబు, బోండా ఉమకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు, బొండ ఉమకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయతే, నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు లేదని టీడీపీ నేత బోండ ఉమా పేర్కొన్నారు. విచారణకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.