Friday, November 22, 2024

ఇక అంతా దూకుడే..! ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ..

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీలో ఎన్నికల సందడి మొదలైంది. మహానాడు జోష్‌లో ఉన్న ఆ పార్టీ నేతలు ఇక ఈ ఏడాదంతా ప్రజల మధ్యలో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి మొదలుకుని అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా రోడ్‌మ్యాప్‌ సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తయిన వెంటనే ఒక్కరోజు విరామంతోనే రైతుపోరుబాటకు సిద్ధం కానున్నారు. ఈ నెల 20వ తేదీన కడప జిల్లా నుంచి రైతు సమస్యలపై పోరుబాటకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు బాదుడే – బాదుడు నిరసనలు, మరోవైపు ఎన్టీఆర్‌ స్ఫూర్తి – చంద్రన్న భరోసా పేరుతో దాదాపు వంద నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలతో పాటు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మహానాడును నిర్వహిస్తూ వచ్చేలా ప్లాన్‌ చేశారు. ప్రతి జిల్లాలో పర్యటన ఉండేలా అధిష్ఠానం రూట్‌మ్యాప్‌ను తయారు చేసింది. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ప్రజా సమస్యలపై గళమెత్తడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా చంద్రబాబు తన పర్యటనలు కొనసాగిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతులు దయనీయస్థితిలో ఉన్నారని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ వారి సమస్యలపై స్పెషల్‌ ఫోకస్‌ను పెట్టింది. పంటనష్టం పరిహారం, రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఉద్యమ కార్యాచరణను ప్రారంభించనుంది.

ఇక నేతలూ బిజీనే..!

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నేతల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి ముఖ్యనేత నియోజకవర్గాల్లో కనీసం 20 రోజులు ప్రజల్లోనే ఉండేలా మార్గదర్శకాలను జారీచేసింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రధాన సమస్యలపై పోరుబాట పట్టాలని అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని నేతలకు అధినేత చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. బాదుడే – బాదుడు వంటి కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యలపై ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఇదే సమయంలో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. బాదుడే – బాదుడు, రైతు పోరుబాటతో పాటు నియోజకవర్గాల ముఖ్యనేతలు ఆయా నియోజకవర్గాల పరిస్థితులకు అనుగుణంగా మరో కొత్త కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగాలని అధినేత ఇప్పటికే సూచనలు చేశారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల నేతలు బాదుడే – బాదుడు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తున్నారు. రానున్న జులై నుంచి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతల కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్‌..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తండ్రిబాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి అధికార పీఠాన్ని ఎక్కించేందుకు నారా లోకేష్‌ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు లోకేష్‌లు పాదయాత్రపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌పై కూడా చర్చ సాగుతోంది. దాదాపు ఏడాది పాటు పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రలు, కార్యక్రమాలతో పార్టీ కేడర్‌లో పూర్తి జోష్‌ను నింపి ఎన్నికల శంఖారావాన్ని పూరించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement