అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టై బెయిల్‌పై వచ్చిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. శనివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజాకు 10.30 సమయంలో చేరుకున్నారు.
టోల్ ప్లాజా వద్ద భారీగా మోహరిం చిన పోలీసులు పట్టాభి వాహనం వెనుక కాన్వాయ్‌గా వస్తున్న ఇతర వాహనాలను నిలిపివేశారు. పట్టాభి కారును తమవెంట తీసుకువెళ్లారు. దీంతో పట్టాభి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేతలు కొంత ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో పట్టాభి సెల్‌ఫోన్‌తో పాటు బాడీగార్డ్, డ్రైవర్ ఫోన్లు కూడా పనిచేయక పోవడంతో మరింత టెన్షన్‌కు లోనయ్యారు. దీనికి తోడు పోలీసులు పట్టాభి అదృశ్యంతో తమకు సంబంధం లేదని తమ అదుపులో లేడని తేల్చిచెప్పడం గందర గోళానికి దారి తీసింది.
సుమారు గంట తర్వాత అర్థరాత్రి సమయంలో తాను సురక్షితంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే పట్టాభిపై మరో నాలుగు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. బెయిల్‌పై విడుదల అయిన తనను ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం.