Tuesday, November 26, 2024

లక్షా యనభై వేలకు ఇల్లు నిర్మాణం సాధ్యమా?

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. జగనన్న కాలనీల పేరుతో ఇళ్లు నిర్మిస్తాం అన్నారని…ఇప్పుడు మాట తప్పి ప్రజలే కట్టించుకోవాలి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా యనభై వేలకు ఇల్లు నిర్మాణం సాధ్యమా…దీనిపై సీఎం, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని తేలిపోయిందన్నారు. పేదవారంటే వైసీపీ ప్రభుత్వానికి‌ చులకన అయిపోయిందని విమర్శించారు. చంద్రబాబు తొంభై శాతం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎందుకు నిలిపి‌వేశారని ప్రశ్నించారు. పది శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేక పోయారని ధ్వజమెత్తారు.

డబ్బులు కట్టిన ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే స్థలాలు అయితే కమిషన్లు దోచుకోవచ్చని కొత్త పధకం పేరుతో హడావుడి చేశారన్నారు. జగనన్న కాలనీల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని..జగన్ పాలన‌పై ఎవరికీ నమ్మకం లేక వెనుకడుగు‌ వేస్తున్నారని చెప్పారు. జగన్ పబ్లిసిటీలోనే పనులు… క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించవన్నారు. ప్రభుత్వ‌ అవినీతిని‌ ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు అధికార మదంతో మాట్లాడుతుంటే… జగన్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ప్రశ్నించారు. జగనన్న కాలనీల పేరుతో మీరు, మీ మంత్రులు జేబులు నింపుకుంటున్నారు.. పేద వాళ్ల మీద మాత్రం భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బుద్దా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement