మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలపై పిన్నెల్లి పైశాచికం పేరుతో టీడీపీ నేతలు పుస్తకం విడుదల చేశారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, కాని వైసీపీ హయాంలో ఈవీఎంలు సైతం ధ్వంసం చేసే పరిస్థితికి మళ్లీ ఫ్యాక్షనిజం పురుడు పోసుకుందని మండిపడ్డారు. వైసీపీ నేతలు అన్నింటిలో దోపిడీయే పనిగా పెట్టుకున్నారని, ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాళ్లకు వాటా ఇవ్వాల్సిందేనని ధ్వజమెత్తారు.
ప్రజలు పాస్‌పుస్తకాలకు అప్లయ్ చేసినా, అప్లయ్ చేసిన వాళ్ల వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయని, ఈ నేపథ్యంలో అభ్యర్థులు పిన్నెల్లికి నగదు ఇవ్వాలని ఆరోపించారు. ఆఖరికి పాస్‌పుస్తకాల్లో సైతం రూ.15 వేలు దోచుకునే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందంటే వైసీపీ నేతల రౌడీయిజం ఏ స్థాయికి చేరిందో అర్థంమవుతుందన్నారు. కాగా పిన్నెల్లికి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని.. ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం వచ్చిందని, అందుకే నేడు పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పిన్నెల్లి పారిపోయారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా వైసీపీ నేతలు రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఎదురుతిరిగిన వాళ్లపై వైసీపీ రైడీమూకలు మారణాయుధాలతో దాడులు చేశారని పేర్కొన్నారు. అయితే అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఉన్నన్నాళ్లు మంచి చేయాలని, మంచి చేయకపోతే అధికారం కోల్పోయేలా ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.