గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఎక్సైజ్ పోలీసుల దాడిలో మృతి చెందిన అలిషా కుటుంబ సభ్యులను టీడీపీ నేతల బృందం పరామర్శించింది. అలిషా చిత్ర పటానికి టీడీపీ నేతలు నివాళ్లు అర్పించారు. అలిషా కుటుంబాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని, నాగూల్ మీరా తదితరులు ఓదార్చారు. అలిషా ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లింలు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ కొండారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
కాగా, గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారనే నెపంతో అలీషాని పోలీసులు కొట్టి చంపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా మద్యం తరలిస్తున్నారంటూ ఎక్సైజ్ పోలీసులు కొట్టారని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన షేక్ అలీషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. కారులో షేక్ అలీషాతో పాటు మరో వ్యక్తి మద్యం సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ పోలీసులు వారిని ప్రశ్నించారు. అయితే పోలీసులకు సమాధానం చెప్పకుండా ఎదురుతిరిగారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో మనోవేదనకు గురైన షేక్ అలీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలీషా మరణించాడు.
ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు ఎక్సైజ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలీషా మృతికి ఎక్సైజ్ పోలీసులే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎక్సైజ్ అధికారులపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండిః వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలేంటి? : సీబీఐ ఆరా