Tuesday, November 26, 2024

ఇది మాయల మరాఠి బడ్జెట్‌.. ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘన.. బడ్జెట్‌పై టీడీపీ నేతల ధ్వజం

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ మండిపడింది. శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదో మాయల మరాఠి బడ్జెట్‌ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణాలను చేపట్టాలని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా.. దానికి తగ్గట్లుగా బడ్జెట్‌ కేటాయింపులు లేవని అన్నారు. అసలు బడ్జెట్‌లో అమరావతి ప్రస్తావనే లేకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అన్నారు. గడిచిన మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రుణాలిచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం మోసాలన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు. అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఈ బడ్జెట్‌ చీకటి బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. అకౌంటబులిటీ లేకుండా గ్లోబెల్స్‌ ప్రచారం చేసుకోవడం ఆర్థిక ఉగ్రవాదమని మండిపడ్డారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని దీంతో రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుందని అన్నారు. బడ్జెట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని అప్పులు తెచ్చిన లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ప్రకటనలకే బడ్జెట్‌ పరిమితమైందే కానీ రాజ్యాంగబద్ధంగా లేదని విమర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో సుమతీ శతకాలు, పెదబాలశిక్ష చదవడం తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవ సాయంలో రాష్ట్రం ప్రధమస్థానంలో ఎలా ఉందో అర్థం కావడం లేదన్నారు. 33 నెలలు పరిపాలనలో రూ. లక్షా 10 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేశామని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. 14.5 శాతం వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెబుతున్నారని ఆ వృద్ధి రైతుల కుటుంబాల్లో కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో కనీసం ధాన్యం అమ్ముకునేందుకు కూడా దిక్కులేని పరిస్థితి ఉందని విమర్శించారు. తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తుంటే ఇక్కడ కోతలు పెడుతున్నారని, అక్కడ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదని, ఇక్కడ మాత్రం మీటర్లు బిగిస్తున్నారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement