Monday, November 18, 2024

petrol and diesel prices: ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళ‌న‌లు చేపట్టింది. ఈ నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్ ధరలు ఉన్నాయని, వాటిని వెంటనే తగ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐల్యాండ్ సెంట‌ర్ వ‌ద్ద టీడీపీ ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఎద్దుల బండితో ట్రాక్ట‌ర్ లాగుతూ నిర‌స‌న తెలిపింది. ఈ ఆందోళ‌న‌లో టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర కూడా పాల్గొన్నారు.

క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో పెట్రోల్ బంకుల వ‌ద్ద టీడీపీ నేత‌లు అందోళ‌న చేశారు. ఈ సందర్భంగా ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. పులివెందుల వెళ్తున్న టీడీపీ నేత బీటెక్ ర‌విని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భవానీపురంలో ఆ పార్టీ శ్రేణులు పెట్రోల్ బంకుల ముందు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులోని గాయత్రీ ఎస్టేట్ నుంచి మెడికల్ కళాశాల పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement