Monday, November 11, 2024

ఉమపై దాడి చేసి ఎదురు కేసులా?: టీడీపీ నేతల ఫైర్

మాజీమంత్రి దేవినేని అరెస్ట్​ను టీడీపీ నేతలు ఖండించారు. ప్రజా సంపదను వైసీపీ నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా అని ప్రశ్నించారు. దేవినేనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండా రాజకీయాలను ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఒక్కరిపై 100 మంది దాడిచేయడం పిరికిపింద చర్యగా అభివర్ణించారు.

వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. నిందితులను వదిలేసి, బాధితులను అరెస్ట్ చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమను వదిలేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వసంత కృష్ణప్రసాద్‌ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకు తింటున్నారని యనమల ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. వైసీపీ నేతల దోపిడీపై టీడీపీ పోరాటం ఆగదని యనమల స్పష్టం చేశారు.

కాగా, నిన్న  దేవినేని ఉమ కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఆయన బావమరిది అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ అక్కడ క్వారీయింగ్‌ను పరిశీలించి ఆ తర్వాత జి.కొండూరు వైపు బయల్దేరారు. ఈ క్రమంలో గడ్డమణుగు-మునగపాడు మధ్య ఆయన కారుపై ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో కొందరు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన అక్కడకు చేరుకుని మాజీ మంత్రి దేవినేనికి రక్షణగా నిలిచారు. ఈ సందర్భంగా వైసీపీ , టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దేవినేని ఉమను జి.కొండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చి ఆందోళన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement